అద్దంకి:అంతర్జాతీయ దొంగల ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం
అద్దంకి:పట్టణంలో ఈనెల 25వ తేదీన అర్ధరాత్రి సమయంలో శ్రీరామ్ ఏజెన్సీ నందు షట్టర్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలను చీరాల డిఎస్పి మహమ్మద్ మెయిన్ పర్యవేక్షణలో సర్కిల్ సిఐ కృష్ణయ్య ఆధ్వర్యంలో 21 మంది సర్కిల్ రూరల్ ఎస్సైలు మరియు పోలీసు సిబ్బంది బృందాలుగా ఏర్పడి ముద్దాయిలను సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకున్నారు. మంగళవారం కొంగపాడు డొంక వద్ద వారిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ నందు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డిఎస్పి మహమ్మద్ మెయిన్ మాట్లాడుతూ కోనసీమ జిల్లాకు చెందిన బెల్లంకొండ విజయ్, సాయి సూర్య తేజలు పలు జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఆయా దొంగతనాలలో శిక్ష అనుభవిస్తున్న సమయంలో వీరికి పరిచయం ఏర్పడినట్లు డిఎస్పి చెప్పారు. జల్సాలకు అలవాటు పడి నేర ప్రవృత్తిని ఎంచుకున్నారని తెలిపారు. వీరు ఆయా జిల్లాలలో దొంగతనాలకు పాల్పడుతూ ఎలక్ట్రికల్ వస్తువులతోపాటు నగదును దొంగిలించి కారులో పరారు అయ్యేవారని చెప్పారు. ఈ క్రమంలోనే నిందితులు ఇరువురు అద్దంకిలో శ్రీరామ్ ఏజెన్సీ నందు దొంగతనానికి పాల్పడినట్లు మహమ్మద్ మెయిన్ తెలిపారు. వారి వద్ద నుంచి నగదు, ఎలక్ట్రికల్ వస్తువులతో కలిపి 18.14 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు.